My journey with school children! Art&story telling to children

పిల్లలతో కథల – బొమ్మల ప్రయాణం – 1

Click here to English version

                 నా మనవరాలికి కథలు చెప్పేదాన్ని.ఈ కథలు వేరే పిల్లలకు కూడా చెబితే బాగుంటుంది కదా అని మా ఇంటి వెనుక ఉండే మున్సిపల్ స్కూల్కి వెళ్లి పిల్లలకు కథలు చెబుతాను వారానికి ఒక గంట టైం ఇవ్వండి అని అడిగాను .అక్కడి హెల్డ్మాస్టర్ మొదట పై అధికారుల పర్మిషన్ లు కావాలి మళ్ళీ రండని పంపించివేశారు. సరే ఇలా కాదు అని కథలు వినడం వల్ల కలిగే ప్రయోజనాలు,ఎలాంటి కథలు చెప్పాలనుకుంటున్నాను అనే విషయాలు వివరంగా రాసి ఒక అప్లికేషన్ లా , నా బయోడేటాని చేర్చి మల్లీ పోయి ఇచ్చాను. దాంతో ఏమనుకున్నాడో ఏమో సరే అనేశాడు . అక్కడి నుంచి కథలు మొదలయ్యాయి .

ఐదు సంవత్సరాలుగా కథలు చెబుతున్నాను. ప్రతి సంవత్సరం ఇంకొద్ది సమయము వెచ్చించడం కొత్త ఆలోచనలు అమలు చేయటం జరిగింది ప్రతి సంవత్సరం ఏదో ఒక మున్సిపల్ స్కూల్లో పిల్లలకు కథలు చెప్పడం ,వాళ్ళతోతిరిగి చెప్పించడం, బొమ్మలు వేయించడం ,బహుమతులుగా కథల పుస్తకాలు ఇవ్వడం జరిగింది .

              అన్ని తరగతుల పిల్లలకు కథలు చెప్పిన తరువాత ఒక తరగతి పిల్లలకే ఒక సంవత్సరం రోజులు కథలు చెప్తాము అనిపించి ఈ విద్యా సంవత్సరం లో ఒక ఎలిమెంటరీ స్కూల్లోని ఐదవ తరగతి పిల్లలను మాత్రమే తీసుకున్నాను .ఇక్కడ అందరూ పేదపిల్లలు,అనాధ పిల్లలు ఉన్నారు. వారానికి ఒక సారి రెండు గంటలు వాళ్లకి కథలు చెప్పడం ,వాళ్ళ చేత బొమ్మలు వేయించడం,వాళ్ళనికథలు చదివేలా చేయటం ,వాళ్లకు బహుమతులుగా పుస్తకాలివ్వటం, ఏడాది చివర ఒక్కొక్కరి దగ్గర కనీసం నాలుగన్నాకథల పుస్తకాలు వాళ్లవి అంటే బహుమతులుగా వచ్చినవి ఉండాలి అనుకున్నా.

కథలు చెప్పటం

ఐదో తరగతి పిల్లలకు కథలు చెప్పాలంటే జాగ్రత్త పడాలి . వాళ్ళని కుదురుగా కూర్చునేలా కథని చెప్పకపోతే వాళ్ళు చేసే అల్లరిలో మన మాటలు వినపడవు . అందుకని నేను ముందు రోజే కథ చదువుకొని ఒక సారి బయట చెప్పుకొని రిహార్సల్ చేసుకుంటా, డీటెయిల్స్ ని కలుపుకుంటా. ఇలా సిద్దపడి పోవాల్సిందే .
ఎప్పుడన్నా పుస్తకంలో చూసి కూడా కథ చదువుతాను .చదవటానికి కూడా కథను ముందు ఇంట్లో ఒక సారి చదువుకొచ్చేదాన్ని . ఎందుకంటే కథను చదివేటప్పుడు ప్రతి లైన్ కొకసారి వాళ్ళని చూస్తూ ఇంకాస్త వివరించాలి ఇంకాస్త ఆసక్తిని పెంచాలి.ఊరికే చదువుకుంటూ పోతే వాళ్లకి బోర్ కొడుతుంది . ముఖ్యంగా చదవడంలో కాస్తపెద్దకథలు చెప్పచ్చు . అందులో ఉన్న అనేక వర్ణనలు,సూక్ష్మ మైన విషయాలు తప్పి పోకుండా ఉంటాయి . అది పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు .పిల్లలకు ఎప్పుడూ కొత్తగా ఉండే కథలు చెప్పాల్సిందే .ఆ కథని మనం ఎంత శ్రద్ధతో ఇష్టంతో చెబితే వాళ్ళు అంత ఇష్టంగా వింటారు.నిర్లక్ష్యంగా ,సిద్దపడకుండా పోతే వాళ్ళ అల్లరితో మనకి జవాబు చెబుతారు.

బొమ్మలు గీయటం

                మొదట్లో రెండు లేక మూడు కథలు చెప్పేదాన్ని ఎంత నెమ్మదిగా చెప్పినా ముప్పై నలభయ్ నిమిషాల్లో కథలు చెప్పడం అయిపోతుంది .తర్వాత ఎలా వీళ్ళతో గడపాలి అనేది సమస్య అయ్యింది వాళ్ళచేత వేరే కథలు చెప్పించినా ఒకటి రెండు వింటారు. మళ్ళీ ఉత్సాహం పోతుంది . అందుకని నేను బొమ్మలు వేయించడం మొదలు పెట్టాను . పిల్లలకు బొమ్మలు నేర్పించడం అనేది నాకు తెలియదు.అందుకని నేర్పించే జోలికి నేను పోలేదు. నేను చెప్పేకథలకు బొమ్మలు వేయమని అడిగా.ఎట్లా వేసినా పర్వాలేదు.రంగులతో ఆడు కోండి అని చెప్పా . అప్పటినుంచికథలకి బొమ్మలు వేయటం మొదలు పెట్టారు . మొదట్లో అలవాటుగా రెండు మూడు కథలు చెప్పి బొమ్మలు వేయమన్నపుడు మూడుకథల లోని పాత్రలు కలిపి ఒక బొమ్మలో వేసేసే వాళ్ళు . సరే ఇలా కాదు అని ఒక్క కథ మటుకే చెప్పి దానికి బొమ్మ వేయమనేదాన్ని . ఇదంతా పూర్తి కాను రెండు గంటల పైన పట్టేది .

50మంది పిల్లలకోసం ఒక పది ప్లాస్టిక్ డబ్బాల్లో క్రేయాన్స్,రంగుపెన్సిళ్ళు ,మూడు మూడు సెట్లు పోసి పెట్టుకున్నాను.15రబ్బర్లు ,15 మెండెర్స్ ఇంకో డబ్బాలో పెట్టాను .50 పెన్సిల్స్ఒక బాక్స్లో పెట్టుకున్నాను . పేపర్లు స్కూల్ వాళ్ళు ఇచ్చారు. ఆడపిల్లలు 13మంది ఉంటె అబ్బాయిలు 30 మంది దాకా ఉంటారు . కథ చెప్పేసిన తరువాత ఐదైదు మందితో గ్రూప్ అయిపోమని చెబుతాను . ఒక్కొక్క గ్రూప్ కి పేపర్ల తో పాటు ఒక రంగుల డబ్బా,అందరికీ పెన్సిళ్లు,రెండుమెండర్లు, రెండు రబ్బర్లు ఇస్తాను . ఇక పిల్లలు నేను చెప్పిన కథకు బొమ్మలు వేయటం మొదలు పెడతారు . మళ్ళీ వాళ్లకు కథలో ఏఏ పాత్రలున్నాయి.మీకు ఏది బాగా నచ్చింది లాంటి కబుర్లు చెబుతూ వాల్ల చుట్టూ తిరుగుతూ ఉంటా.

బొమ్మలేసే క్రమంలో నేను బొమ్మలో ఎక్కడా తెలుపు వదలకూడదని,బ్యాక్ గ్రౌండ్ లో కూడా రంగులు కొట్టాలని ,పేపర్ నీటుగా ఉండాలని ,వెనుక మాత్రమే పేర్లు రాయాలని ,రంగులు కొట్టేటప్పుడు ఒక దిశలోనే కొట్టాలని, బొమ్మలు పెద్దవిగా వేయాలని ,ఏ రంగుపక్కన ఏ రంగు ఉంటె ఎత్తి చూపిస్తుందో లాంటి నాకు తోచిన టెక్నికల్ సలహాలు ఇస్తుంటా .కొంతమంది వాళ్ళ పాత అలవాటు ప్రకారం నేను ఇల్లు బొమ్మ వేస్తా. జెండా బొమ్మ వేస్తా అంటూ ఉంటారు . అట్లా కాదు మీరు ఎట్లన్నా చెప్పిన కథకే బొమ్మవేయండిఅని వాళ్లకి కొన్ని సలహాలిచ్చి దగ్గర కూచుంటే వేసేసే వాళ్ళు .అలా బొమ్మలు అద్భుతంగా వేయటం మొదలుబెట్టారు.

నాకు అనిపించింది ఏ మంటే కథ వినటం ద్వారా వాళ్ళల్లో ఒక ఊహా ప్రపంచం తెరుచుకుంటే , బొమ్మ వేయటం ద్వారా కథను ఇంకా బాగా గుర్తు పెట్టుకుంటారు,బౌతికంగా గంట సేపు పనిలో మునిగిపోతారు. ఎందుకో ఎప్పుడూ ఆడపిల్లలు అద్భుతంగా వేస్తారు .ఆదివారం క్లాస్ అయిపోతే సోమవారం కూర్చుని వాళ్ళబొమ్మలు చూస్తూ ,ఆ రంగులు చూస్తూ ఆనందిస్తుంటాను బాగా వేసిన వారి బొమ్మలు పక్కన బెట్టి కామెంట్స్ రాసి వాళ్లకి బహుమతులు ఇవ్వాలని నోట్ చేసుకుంటాను. అలానే ఎదో ఒక రకంగా పుస్తకాలు అందేలా అందర్నీ దృష్టిలో పెట్టుకుంటాను . ముందు రోజు చెప్పిన కథ, క్లాసులో జరిగిన విషయాలు కూడా రాసి పెట్టుకుంటాను. ప్రతి వారమూ ఆరేడు పుస్తకాలు బహుమతులుగా ఇస్తుంటాను .

కథల పుస్తకాలు

               కథల విషయానికి కొస్తే నామిని “మా అమ్మ చెప్పిన కథలు” ,జతగాళ్ళు కథగాళ్ళు(హోసూరు కథలు),సామాన్య గారి “టీ తోటల ఆదివాసులు చెప్పిన కథలు”,పీకాక్ వారు వేసిన ఆస్కార్ వైల్డ్ పిల్లల కథలు ,ఆండర్సన్ కథలు,జర్మన్ జానపద కథలు,ఉక్రేనియన్ జానపద కథలు, hbt వాళ్ళ చిన్నోడి ప్రయాణం (చైనా జానపద కథలు) ,కొరియన్ జానపద కథలు ,న్యూ సిలబస్ లిటరేచర్ వారి గులిస్తాన్,ఆఫ్రికా కథల పుస్తకం, రస్తా ఇ సంచికల్లో వచ్చిన ఇటాలో కాల్వినో (ఇటాలియన్ జానపద) కథలు, ,జనవిజ్ఞానవేదిక వారి పిల్లల ప్రచురణలు, చౌడేపల్లి వాళ్ళ పిల్లల ప్రచురణలు,మంచి పుస్తకం హైదరాబాద్ వారివి ,నేషనల్ బుక్ ట్రస్ట్ పిల్లల పుస్తకాల నుంచి చెప్పాను . ఇంకా కొన్ని పేర్లు మర్చి పోయినవి ఉండచ్చు .

               పిల్లలకు బహుమతులుగా ఇచ్చేటపుడు ధర కాస్త తక్కువతో పాటుమంచి కథ ,మంచి బొమ్మలు కూడా ఉండాలి. జనవిజ్ఞానవేదిక వారి పిల్లల ప్రచురణలు ,చౌడేపల్లి వాళ్ళ పిల్లల ప్రచురణలు ,మంచిపుస్తకం,హైదరాబాద్ వారివి ,నేషనల్ బుక్ ట్రస్ట్ పిల్లల పుస్తకాలు, పిల్లలకు బహుమతులుగా ఇచ్చాను అంతే కాక ఎప్పుడూ పాతపుస్తకాల అంగడిలో బాలమిత్రలు ,బాల భారతం పుస్తకాలు ,ఇంకా దొరికే అన్ని రకాల పిల్లల పుస్తకాలు సేకరిస్తుంటా . అలాగే పుస్తక ప్రదర్శనల్లోకొన్న వాటిని కూడా వాళ్లకి బహుమతులుగా ఇస్తుంటాను .

కథలు చదవటం

                  ఒక సారి కథ ను చదివి సిద్దపడి పోయే టైం లేకపోయింది దాంతో నా దగ్గర ఉన్న ఒక ముప్పై పుస్తకాలు తీసుకెళ్లి చదవమని ఇచ్చాను.కథలు వినటం అలవాటయ్యింది కాబట్టి తెచ్చిన పుస్తకాలని చక్కగా చదివేసి పుస్తకాలు కూడా ఒకరొకరు మార్చుకుని మరీ చదివారు. అందులోనూ టాల్ స్టాయ్ కథలు , నామిని కథలు చదివిన ఒక పాప ఎప్పుడూ ఇలాంటి కథలే తెండి అని చెప్పింది .ఆ పాప కథా నాణ్యతను పట్టేసింది అని నాకు చాలా సంతోషమయ్యింది . ఒక్కొక్క సారి కథల్లో స్టీరియో టైపు పాత్రలను మార్చి చెబుతుంటా !మొత్తం క్లాస్ లో ఒక నలుగురైదుగురు మాత్రం అల్లరి చేస్తూ ఉంటారు. ఫోకస్ చేయలేకపోతుంటారు మరో నలుగురు పిల్లలు కథ చెప్పేంత వరకు ఉంటారు .బొమ్మలేసేటపుడు కనిపించరు. మాయమై పోతుంటారు . ప్రతి సారీ నేను ఐదో తరగతి పిల్లలకు కథలుచెప్పేటప్పుడు ఇద్దరు నాల్గో తరగతి పిల్లలు ఇద్దరు మూడో తరగతి పిల్లలు వచ్చి కూచునేస్తారు .ప్రతి క్లాసుకీ హాజరవుతారు .

                 ఒక సారి పిల్లలు బాగా అల్లరి చేస్తున్నారు. నాకే ఆ రోజు శక్తి లేక కాస్త విసుక్కుంటూ అన్నా “నేను ఇంత కష్టపడి వచ్చి మీకు కథలు చెబుతున్నా, డబ్బులు పెట్టి పుస్తకాలు తెస్తున్నా ఇంత అల్లరి చేస్తే ఎందుకు మీకు పుస్తకాలివ్వాలి ” అని . ఒక్క క్షణం నిశ్శబ్దం . ఒక్క చూపు చూసారు నన్ను .మళ్ళీ మామూలే, వాల్ల అల్లరిలో వాళ్ళు పడిపోయారు . కానీ వాళ్ళ చూపును నేను మర్చిపోలేను. ఆ చూపు ద్వారా “మీరు కూడా వాడేది అదే భాషేనా ,మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు,కథలు ఎవరు చెప్పమన్నారు,పుస్తకాలు ఎవరు ఇమ్మన్నారు” అని . నా ఈ మొత్తం ప్రయాణంలో సిగ్గుపడిన క్షణాలవి .

మొత్తంగా 26 వారాలు, 35 కథలు . వాటికి ఒక్కో వారం ముప్పై నుంచి నలబై బొమ్మలు .

చివరి క్లాస్ లో మరి కొన్ని పుస్తకాలు బహుమతులుగా అందరికీ ఇవ్వడం ద్వారా పైన నేను చెప్పినట్టు ఒక్కొక్కరు నాలుగు పుస్తకాలుపైనే స్వంతం చేసుకున్నారు .

ఈ సెలవుల్లో పది కథలు కొత్తవి సేకరించమని,వాటికి బొమ్మలు వేసుకు రమ్మని చెప్పాను . పెళ్లిపత్రికలు,అట్టలు సేకరించి వాటిపైన ఇంట్లో దొరికేబొగ్గు,ముగ్గురాయి,ఎర్రమట్టి,పసుపు, కుంకుమ, పేడ ,కాఫీ పొడి లాంటి వాటితో వేయమని, ప్రయోగాలు చేయమని చెప్పి మళ్ళీ కలుస్తామని వీడ్కోలు పలికాను .

ఇదీ ఈ విద్యా సంవత్సరంలో పిల్లలతో నా కథల – బొమ్మల ప్రయాణం !

 

 

 

 


My journey with children – Storytelling and Drawing..


I tell stories for my grand daughter regularly.

I thought I could also tell the same stories to school children, so I started telling stories to government school students five years back and it is still continuing. After telling stories to different classes, this academic year I wanted to stick with only one class. So I took fifth class students from one elementary school. All students are poor and orphans. My goal is not just telling stories, but also asking them to tell stories, making them draw, making them to read story books and giving story books as prizes. At the end of the year each child must have four to five story books of their own.

Telling stories

Because telling stories for fifth class students is not easy, I will prepare a day ahead by rehearsing. If we don’t prepare well they make such a noise that we can’t control them. The children always need the best stories. Sometimes I read stories from story books because of details and language. Children like the details.

For many years I have been gathering children’s story books. I have translations of worldwide folk tales and I always search out the best publications of children’s books from the main book shops and book exhibitions. I also visit second-hand book stalls regularly.

Drawing from stories

When I tell two or three stories, the session finishes in about 30 minutes, so in order to spend more time with the children I asked them to draw from the story. At first they hesitated, but I said whatever you want to draw, do it. Just play with colors. Then they started. Now after story telling they will form into groups, each with have five students. I supply crayons, color pencils, papers etc. and I give advise on some technical issues like drawing big, coloring evenly, making clean work, don’t leave backgrounds white but fill in with colors, don’t write on the drawing, etc. Their beautiful drawings came out with lots of color and creativity. Always girls do the best. The next day I will check their work, write notes, and select some children to give story books for their best work.

– When I am telling the stories, four or five children make noise. they can’t concentrate.

– Four children from other classes join regularly; they don’t leave.

– Four or five children attend only for the story telling class; they escape drawing class.

– Other classes’ children always ask me to take story class for them.

– Sometimes I don’t tell stories; I will give story books out and they sit and read.

– At the end each child owned three to four books as prizes

Total 26 weeks, 35 stories, for each story there will be 30 to 40 art works.(drawings)

This is my learning journey with school children in this academic year!


Best wishes and Thanks for Reading!

Kiran

14 thoughts on “My journey with school children! Art&story telling to children”

  1. కిరణ్ గారూ, పిల్లలపై ఎంత ప్రేమతో బాధ్యతతో ఈ పని చేస్తున్నారు ! మీ స్నేహం వాళ్ళను చదువుల వత్తిడి నుంచి కొంతయినా బయట పడేస్తుందని ఆశగా ఉంది.

    1. అవునండీ ,కాస్సేపు ఆ కథల ప్రపంచంలో మునిగిపోతారని… థాంక్యూ!

  2. అద్భుతం. మీరు పసిపిల్లల్లో మంచి విత్తులు విత్తుతున్నారు.

    1. మీ లాంటి వాళ్ళు ఎంతో మంది స్ఫూర్తి కదా!

  3. That’s really an amazing journey Kiran aunty. Very inspiring! Thanks for sharing your experiences.

  4. Really a wonderful journey Kiran. Certainly the benefit is on both sides. This telling/reading the stories help them to form a good personality. Your efforts today will produce good citizens with respect for human values. Kudos for your efforts and commitment.
    May God bless you with health and peace to have a continuous commitment for the community.

  5. చాలా చాలా మంచి పని సర్.
    కథలు వినడమే కాదు.వాటికి బొమ్మలు వేయడం అనేది వారిలో ని సృజనాత్మక శక్తికి నిదర్శనం.
    హృదయపూర్వక అభినందనలు సర్

  6. కిరణ్,ఈ రోజే చదివాను పిల్లలతో మీ కథల-బొమ్మల ప్రయాణం.నిజంగా చాలా సంతోషమేసింది.ఆశయాలు అందరికీ వుంటాయి కానీ ఆచరణలో పెట్టడం అందరికీ సాధ్యం కాదు. మీ అభిలాషకు,పూనికకు,ఆచరణకు అభినందనలు.మీరు ఏ ఏరియా ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లారో తెలియచేయండి.

    1. థాంక్సండీ ! తిరుపతి లోని కొన్ని  మున్సిపల్ స్కూల్స్ ,బాలమందిరం  అండీ !

Comments are closed.