స్కూలు పిల్లలతో నా అనుభవాలు – 2
గతవిద్యా సంవత్సరం “పిల్లలతో కథల-బొమ్మల ప్రయాణం”అనుభవాలు పంచుకున్నా
(చూడని వారు పిల్లలతో నా ప్రయాణం లో చదవచ్చు )
ఈ విద్యా సంవత్సరంలో కూడా స్కూల్ పిల్లలకు కథలు చెప్పటం,బొమ్మలు వేయించడం తో పాటు పిల్లల కథల పుస్తకాల సేకరణపై దృష్టి పెట్టాను .
అందులో భాగంగా మంచి పుస్తకం వారి ప్రచురణలు ,నేషనల్ బుక్ ట్రస్ట్ వారి ప్రచురణలు ,ప్రథమ్ బుక్స్ వారి ప్రచురణలు జనవిజ్ఞానవేదిక ,విజ్ఞానవేదిక ,ప్రజాశక్తి బుక్ హౌస్ వారి ప్రచురణలు,అనగనగా వారి ప్రచురణలు తెప్పించాను .
అలానే పాత పుస్తకాల షాపుల నుంచి కొన్ని పుస్తకాలు సేకరించాను . అన్నీ పిల్లల తెలుగు కథల పుస్తకాలే .దాదాపు 18,000 రూపాయలకు కొన్నాను .
-హైదరాబాద్ లో ‘మంచి పుస్తకం’వారి దగ్గర వారి ప్రచురణలేకాక పిల్లల సాహిత్యానికి సంబంధించి (children book trust)CBT , కొత్తపల్లి ,పీకాక్ క్లాసిక్స్ ,జనవిజ్ఞానవేదిక ,విజ్ఞాన వేదిక , సాహితి లాంటి ఇతర ప్రచురణలు కూడా దొరుకుతున్నాయి .ఒక్కచోటే అన్ని పుస్తకాలు దొరకటం బాగుందనిపించింది .
–ఢిల్లీ ప్రథమ్ బుక్స్ వారివి తెలుగులో మొత్తం 105 పుస్తకాలు ఉన్నాయి 3,800 రూపాయలు పడింది .
-నేషనల్ బుక్ ట్రస్ట్ వి తెలుగులో పిల్లల కథల పుస్తకాలు దాదాపు 80 దాకా ఉంటాయి. స్కూల్ పిల్లలకు 30శాతం తగ్గింపుపై పుస్తకాలు ఇస్తున్నారు .
తెలుగులో కన్నా ఇంగ్లీష్లో పిల్లలకు పుస్తకా లు ఎక్కువున్నాయి .
ఇలా నా దగ్గర పిల్లల కథల పుస్తకాల సంపద చేరింది. పిల్లలపై నిజమైన ప్రేమ , నిబద్దత ,సృజనాత్మకత ఉండే వాళ్ళు ఎంత కష్టపడితే పిల్లల కోసం ఇలాంటి కథల పుస్తకాలు బయటకు వస్తాయి కదా ! అందుకే ఆ పుస్తకాలు అపురూపంగా చాలా విలువైనవి గా కనిపిస్తాయి.
– నేను ఇలా పుస్తకాలు తెప్పించడం చూ సిన ఒక ప్రైవేటు స్కూల్ వారు కూడా NBT వారివి ,మంచిపుస్తకం వారి ప్రచురణలు తెప్పించుకున్నారు . అదొక సంతోషం.
– అలానే నేను పోయే స్కూల్ అధికారి నేను పుస్తకాలు తెప్పించటం చూసి తన సొంత డబ్బుతో పిల్లలకి మరికొన్ని కథల పుస్తకాలు తెప్పించారు .
చదివే అలవాటు
ఈ పుస్తకాలు తెప్పించిన తరువాత నేను ప్రతి వారం ఒక 70 పుస్తకాలు సంచిలో పెట్టుకొని పిల్లల దగ్గరకు వెళ్లేదాన్ని .
ఐదైదు మందిని గుంపులుగా కూర్చో బెట్టి వారికి మధ్యలో పుస్తకాలు చదవమని పెడతాను
ప్రతి వారమూ కొత్తపుస్తకాలు కలుపుతాను .
ఐదవతరగతి పిల్లలు తప్పనిసరి గా ఉంటారు. ఏడవతరగతి నుంచి చిన్న క్లాసులవరకు ఇష్టముండే వాళ్ళు వస్తారు చదవటానికి .
మొదట్లో పిల్లలు కష్టపడ్డారు కూర్చుని చదివేదాని కి . పది నిమిషాలు పుస్తకాలు చూడడం, ఆ పుస్తకం కావాలి ఈ పుస్తకం కావాలి అని తిరగటం,ఎవరో ఒకరిదగ్గర పెరుక్కోవటం,ఇద్దరూ గొడవపడటం మొదలు పెట్టేవాళ్ళు . గోల ఎక్కువయ్యేది . ఒకర్ని చూసి ఒకరు లేసే వాల్లు.
నాకు కూడా భయం వేసింది నేను కంట్రోల్ చేయలేకపోతున్నానే అని .
వాళ్లకి కథ చెప్పి బొమ్మలు వేయమన్నపుడు బొమ్మలేసే పనిలో పడిపోయేవారు .
ఇప్పుడు చదవమనే సరికి వాళ్లకు అర్థం కాలేదు .
నెమ్మదిగా కాస్త ఉషారుగా ఉండే పిల్లలు చదవటం,బొమ్మల్ని చూడటం ,సంతోషపడడం గమనించిన మి గతా పిల్లలు వాళ్ళను అనుకరించటం మొదలు పెట్టారు .తర్వాత ఆ రంగు రంగుల బొమ్మలు, చిన్న చిన్న కథలు,నాణ్యత తో కూడిన పుస్తకాలు వాళ్ళని ఆకర్షించటం మొదలు పెట్టాయి . వ్యక్తిగత శ్రద్ద తీసుకున్నా .
ఒకొక్కరి దగ్గరకు పొయ్యి కొద్దిగా చదివి వినిపించటం ,అర్థం కానిది చెప్పటం ,ఎవరికీ తగ్గ పుస్తకాలు వాళ్లకి అందేలా చేయటం లాంటి వి.
ఆలా పుస్తకాలు చదివే అలవాటు మొదలయ్యింది పిల్లలకి .
గోల ఎక్కువైనప్పుడు వాళ్ళ టీచర్స్ సహాయము తీసుకునే దాన్ని .
అయితే బొమ్మలు లేకుండా లావుగా ఉన్న పుస్తకాలని ముట్టరు .రంగురంగుల బొమ్మల పుస్తకాలే కావాలి అందరికీ .
ఏడోతరగతికి చెందిన అమ్మాయి ‘నాకు నేను తెలిసే’ పుస్తకాన్ని ఒక దఫాలో తల పక్కకి తిప్పకుండా చదివేసింది
ఇంకో ఆరో తరగతి అమ్మాయి చాలా కథలు చదివేసింది . ఎప్పుడూ కన్నేసి పెడుతుంది కొత్తపుస్తకాలు నేనేమైనా తెచ్చానా అని.వెంటనే ఆ ఆ పుస్తకాలు మొదట ఆమె చదవాల్సిందే . అలా పుస్తకాలు ముందరపెడితే ఆబగా చదివేపిల్లల్ని చూస్తే కడుపు నిండిపోతుంటుంది
– ఒకవారం కథ కి బొమ్మలేస్తే ,మరో వారం పుస్తకాలు చదివే వారు . బొమ్మలు బాగా వేసినవారికి పుస్తకాలు బహుమతులుగా వెళ్ళేవి .
– పుస్తకాలు చదివిన తరువాత ఆ కథల్లో ఏమి నచ్చిందో బోర్డుపైన రాయమనటం
పుస్తకాలివ్వకముందు ఏదైనా విషయాల గురించి కాస్సేపు చర్చించడం ,వాళ్ళని కథలు చెప్పమనటం
లాంటి పనులు కూడా జరుగుతుంటాయి .
నేను పుస్తకాలు కొన్న సంస్థల వెబ్ సైట్ లింక్స్ కింద ఇస్తున్నాను . కథల పుస్తకాలు చదివించడం అనే ఈ కార్యక్రమం ఇప్పుడే మొదలు పెట్టాను కనుక దీనిని ఇంకాస్త బాగా ఎట్లా చేయాలి , ఇంకా కొత్తపుస్తకాలు ఏమున్నాయి అనేది పరిశీలించాలి . వచ్చే విద్యా సంవత్సరం లో దీనిని కంటిన్యూ చేస్తాను . ఆ అనుభవాలు మళ్ళీ మీతో పంచుకుంటాను . అంత వరకూ సెలవు !
nice activity, congrats, continue please
తప్పకుండా సర్ ! థాంక్యూ!