My journey with school children-2

 

స్కూలు పిల్లలతో నా అనుభవాలు – 2

గతవిద్యా సంవత్సరం “పిల్లలతో కథల-బొమ్మల ప్రయాణం”అనుభవాలు పంచుకున్నాను . 

(చూడని వారు పిల్లలతో నా ప్రయాణం లో చదవచ్చు )
 
              ఈ విద్యా  సంవత్సరంలో కూడా  స్కూల్ పిల్లలకు కథలు చెప్పటం,బొమ్మలు వేయించడం తో పాటు  పిల్లల కథల పుస్తకాల సేకరణపై   దృష్టి పెట్టాను . 

అందులో భాగంగా మంచి పుస్తకం వారి ప్రచురణలు ,నేషనల్ బుక్ ట్రస్ట్ వారి ప్రచురణలు ,ప్రథమ్ బుక్స్  వారి ప్రచురణలు జనవిజ్ఞానవేదిక ,విజ్ఞానవేదిక ,ప్రజాశక్తి బుక్ హౌస్ వారి ప్రచురణలు,అనగనగా వారి ప్రచురణలు  తెప్పించాను  .
అలానే పాత  పుస్తకాల  షాపుల నుంచి కొన్ని పుస్తకాలు సేకరించాను .  అన్నీ పిల్లల తెలుగు కథల పుస్తకాలే .దాదాపు 18,000 రూపాయలకు కొన్నాను . 
 
-హైదరాబాద్ లో ‘మంచి పుస్తకం’వారి దగ్గర వారి ప్రచురణలేకాక పిల్లల సాహిత్యానికి సంబంధించి (children book trust)CBT , కొత్తపల్లి ,పీకాక్ క్లాసిక్స్ ,జనవిజ్ఞానవేదిక ,విజ్ఞాన వేదిక ,  సాహితి లాంటి ఇతర ప్రచురణలు కూడా దొరుకుతున్నాయి .ఒక్కచోటే అన్నిపుస్తకాలు దొరకటం  బాగుందనిపించింది .
ఢిల్లీ ప్రథమ్ బుక్స్ వారివి తెలుగులో మొత్తం 105 పుస్తకాలు ఉన్నాయి 3,800  రూపాయలు పడింది .
 -నేషనల్ బుక్ ట్రస్ట్ వి  తెలుగులో  పిల్లల కథల  పుస్తకాలు దాదాపు 80 దాకా  ఉంటాయి.  స్కూల్ పిల్లలకు 30శాతం తగ్గింపుపై  పుస్తకాలు ఇస్తున్నారు .  
తెలుగులో కన్నా ఇంగ్లీష్లో  పిల్లలకు  పుస్తకాలు ఎక్కువున్నాయి . 
 
ఇలా నా దగ్గర పిల్లల కథల పుస్తకాల సంపద చేరింది. పిల్లలపై నిజమైన   ప్రేమ , నిబద్దత ,సృజనాత్మకత ఉండే వాళ్ళు ఎంత కష్టపడితే  పిల్లల కోసం  ఇలాంటి  కథల  పుస్తకాలు బయటకు వస్తాయి కదా ! అందుకే  ఆ పుస్తకాలు  అపురూపంగా  చాలా విలువైనవి గా కనిపిస్తాయి. 
 
– నేను  ఇలా పుస్తకాలు తెప్పించడం చూ సిన ఒక ప్రైవేటు స్కూల్ వారు కూడా  NBT వారివి ,మంచిపుస్తకం వారి ప్రచురణలు  తెప్పించుకున్నారు . అదొక సంతోషం. 
  – అలానే  నేను పోయే స్కూల్ అధికారి నేను పుస్తకాలు తెప్పించటం చూసి తన సొంత డబ్బుతో   పిల్లలకి  మరికొన్ని కథల పుస్తకాలు తెప్పించారు . 
 
    
చదివే అలవాటు 
 ఈ పుస్తకాలు తెప్పించిన తరువాత నేను ప్రతి వారం ఒక  70 పుస్తకాలు సంచిలో పెట్టుకొని పిల్లల దగ్గరకు వెళ్లేదాన్ని . 
 ఐదైదు మందిని  గుంపులుగా కూర్చో బెట్టి  వారికి మధ్యలో పుస్తకాలు చదవమని పెడతాను 
 ప్రతి వారమూ కొత్తపుస్తకాలు కలుపుతాను .
 ఐదవతరగతి పిల్లలు తప్పనిసరి గా ఉంటారు. ఏడవతరగతి నుంచి చిన్న క్లాసులవరకు ఇష్టముండే వాళ్ళు వస్తారు చదవటానికి .
 
మొదట్లో పిల్లలు కష్టపడ్డారు కూర్చుని చదివేదానికి . పది నిమిషాలు పుస్తకాలు చూడడం, ఆ పుస్తకం కావాలి ఈ పుస్తకం కావాలి అని తిరగటం,ఎవరో ఒకరిదగ్గర పెరుక్కోవటం,ఇద్దరూ గొడవపడటం  మొదలు పెట్టేవాళ్ళు . గోల ఎక్కువయ్యేది . ఒకర్ని చూసి ఒకరు లేసే వాల్లు. 
నాకు కూడా భయం వేసింది నేను కంట్రోల్ చేయలేకపోతున్నానే  అని . 
 
 వాళ్లకి కథ చెప్పి బొమ్మలు వేయమన్నపుడు బొమ్మలేసే పనిలో పడిపోయేవారు .
 ఇప్పుడు చదవమనే సరికి వాళ్లకు అర్థం కాలేదు .
నెమ్మదిగా  కాస్త ఉషారుగా ఉండే పిల్లలు చదవటం,బొమ్మల్ని చూడటం ,సంతోషపడడం గమనించిన మిగతా పిల్లలు వాళ్ళను అనుకరించటం  మొదలు పెట్టారు .తర్వాత ఆ రంగు రంగుల బొమ్మలు, చిన్న చిన్న కథలు,నాణ్యత తో కూడిన పుస్తకాలు  వాళ్ళని ఆకర్షించటం మొదలు పెట్టాయి .   వ్యక్తిగత శ్రద్ద తీసుకున్నా .
ఒకొక్కరి దగ్గరకు  పొయ్యి కొద్దిగా చదివి వినిపించటం ,అర్థం కానిది  చెప్పటం ,ఎవరికీ తగ్గ పుస్తకాలు వాళ్లకి అందేలా చేయటం లాంటి వి. 
ఆలా పుస్తకాలు చదివే  అలవాటు మొదలయ్యింది పిల్లలకి  .
 
గోల ఎక్కువైనప్పుడు వాళ్ళ  టీచర్స్ సహాయము తీసుకునే దాన్ని .
అయితే  బొమ్మలు లేకుండా లావుగా ఉన్న పుస్తకాలని ముట్టరు .రంగురంగుల బొమ్మల పుస్తకాలే కావాలి అందరికీ .
 ఏడోతరగతికి చెందిన అమ్మాయి ‘నాకు నేను తెలిసే’ పుస్తకాన్ని ఒక దఫాలో తల పక్కకి తిప్పకుండా చదివేసింది
ఇంకో  ఆరో తరగతి  అమ్మాయి చాలా  కథలు చదివేసింది . ఎప్పుడూ కన్నేసి పెడుతుంది కొత్తపుస్తకాలు నేనేమైనా తెచ్చానా అని.వెంటనే ఆ ఆ పుస్తకాలు మొదట ఆమె చదవాల్సిందే . అలా పుస్తకాలు ముందరపెడితే ఆబగా చదివేపిల్లల్ని చూస్తే కడుపు నిండిపోతుంటుంది  
 
 – ఒకవారం  కథ కి బొమ్మలేస్తే  ,మరో వారం పుస్తకాలు చదివే వారు . బొమ్మలు బాగా వేసినవారికి పుస్తకాలు బహుమతులుగా వెళ్ళేవి . 
– పుస్తకాలు చదివిన తరువాత ఆ కథల్లో  ఏమి నచ్చిందో బోర్డుపైన రాయమనటం
  పుస్తకాలివ్వకముందు  ఏదైనా విషయాల  గురించి  కాస్సేపు చర్చించడం ,వాళ్ళని కథలు చెప్పమనటం   
  లాంటి పనులు కూడా  జరుగుతుంటాయి .
 
నేను పుస్తకాలు  కొన్న సంస్థల వెబ్ సైట్ లింక్స్ కింద ఇస్తున్నాను . కథల పుస్తకాలు చదివించడం అనే ఈ కార్యక్రమం ఇప్పుడే మొదలు పెట్టాను కనుక దీనిని ఇంకాస్త బాగా ఎట్లా చేయాలి , ఇంకా కొత్తపుస్తకాలు ఏమున్నాయి అనేది పరిశీలించాలి .  వచ్చే  విద్యా సంవత్సరం లో   దీనిని కంటిన్యూ చేస్తాను . ఆ అనుభవాలు మళ్ళీ మీతో పంచుకుంటాను . అంత వరకూ సెలవు !

2 thoughts on “My journey with school children-2”

Comments are closed.